Deuteronomy 10

1అప్పుడు యెహోవాా, <<నువ్వు మొదటి పలకల వంటివి రెండు రాతిపలకలు చెక్కి, కొండ ఎక్కి నా దగ్గరకు రా. అలాగే చెక్కతో ఒక పెట్టె చేసుకో. 2నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరవాత వాటిని నువ్వు ఆ పెట్టెలో ఉంచాలి>> అని నాతో చెప్పాడు.

3కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక పెట్టె చేయించి మొదటి పలకలవంటి రెండు రాతి పలకలను చెక్కి వాటిని పట్టుకొని కొండ ఎక్కాను. 4మీరు సమావేశమైన రోజున ఆయన ఆ కొండ మీద అగ్నిలో నుండి మీతో పలికిన పది ఆజ్ఞలనూ మొదట రాసినట్టే ఆ పలకల మీద రాశాడు. యెహోవాా వాటిని నాకిచ్చిన తరువాత నేను కొండ దిగి వచ్చి

5నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో, యెహోవాా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను.

6ఇశ్రాయేలు ప్రజలు యహకానీయులకు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు. 7అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొత్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు.

8అప్పటి వరకూ జరుగుతున్నట్టు యెహోవాా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవాా సన్నిధిలో నిలబడి సేవించడానికి, ప్రజల్ని ఆయన పేరిట దీవించడానికి ఆ సమయంలో యెహోవాా లేవీ గోత్రం వారిని ఎన్నుకున్నాడు. 9అందుకే లేవీయులు తమ సోదరులతో పాటు స్వాస్థ్యం పొందలేదు. మీ దేవుడైన యెహోవాా వారితో చెప్పినట్టు వారి స్వాస్థ్యం ఆయనే.

10ఇంతకు ముందులాగా నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు కొండ మీద ఉన్నప్పుడు యెహోవాా నా మనవి ఆలకించి మిమ్మల్ని నాశనం చేయడం మానుకున్నాడు. 11యెహోవాా నాతో, <<ఈ ప్రజలు నేను వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకొనేలా వారికి ముందుగా నడువు>> అని చెప్పాడు.

12కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు.

13మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవాా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవాా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు?

14చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవాావే. 15అయితే యెహోవాా మీ పూర్వీకుల్ని ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు.

16కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. 17ఎందుకంటే మీ దేవుడు యెహోవాా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు.

18ఆయన అనాధలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు.

19మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి.

20మీ దేవుడైన యెహోవాాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకొని, ఆయన పేరటే ప్రమాణం చేయండి. 21ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.

మీ పూర్వీకులు 70 మంది గుంపుగా ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడైతే మీ యెహోవాా దేవుడు ఆకాశనక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపజేశాడు.

22

Copyright information for TelULB